డాక్టర్ రెహమాన్ సూచనలు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. మండలంలోని వంగర పీహెచ్‌సీ పరిధిలో ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల వారీగా ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వడదెబ్బ ప్రమాదాలు, నివారణ చర్యలు గురించి వివరంగా తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓఆర్‌ఎస్ (ORS) ప్యాకెట్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా రోజంతా ఎండలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వ్యక్తులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొప్పూరు గ్రామంలో ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్త కొమ్ముల రాణి ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేసి, వాటి వినియోగ విధానం, ప్రయోజనాలను వివరించారు.
డాక్టర్ రెహమాన్ మాట్లాడుతూ, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే కారణంగా ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని తెలిపారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ, రుమాలు కట్టుకోవడం, పలుచని,తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందని చెప్పారు.
అలాగే శరీరంలో నీటి లోపం రాకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని, అధిక శ్రమను తగ్గించాలని సూచించారు.
వడదెబ్బకు సంబంధించిన ముఖ్య లక్షణాలు అయిన తలనిర్బంధం, తలనొప్పి, వాంతులు, అధిక అలసట, చెమటలు తగ్గడం, ఛాతి నొప్పి వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
వంగర పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్ సాచెట్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ వంటి ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని, ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని డాక్టర్ రెహమాన్ పునరుద్ఘాటించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు చురుకుగా పాల్గొని ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించారు.