rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 7:24 pm Posted by : RAJAMUDRA NEWS

నిజాంసాగర్ నీటిని తాగునీటి కోసమే వినియోగించుకోవాలి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసమే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని, రూ.30 లక్షలతో నిర్మించిన ఆహార ధాన్యాల నిల్వ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ…నూతనంగా నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని మహిళలు, ఆహార ధాన్యాల నిల్వ భవనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ భవనాలు మహిళా సంఘాల కార్యకలాపాలకు, రైతులకు ధాన్యాల నిల్వ సౌకర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు, గ్రామాల ప్రజలు తాగునీరు, సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నిజాంసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తామని, సాగునీటి కోసం నీటిని విడుదల చేయకూడదని ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని రైతులకు వివరించారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని తమ బోర్లలో నీటి లభ్యతను పరిశీలించుకోవాలని, విద్యుత్ కోతలు, సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరి పంటకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుందని, అందువల్ల నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు, రైతులు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు , బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మద్దినేని నాగరాజకుమారి నాగేశ్వరరావు, స్థానిక నాయకులు గంగాధర్, శంకర్, విజయ్ ప్రకాష్, రఘు మేకల విట్టల్ , రాములు తదితరులు పాల్గొన్నారు.