కామారెడ్డి, రాజముద్ర న్యూస్:
నేరగాళ్లకు సింహస్వప్నం ల కామారెడ్డి పోలీసులని డీజీపీ సివి ఆనంద్ ప్రశంసించారు. ఆపరేషన్ కవచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాలకు చెక్ సైబర్ మోసాల్లో 61 శాతం నగదు రికవరీ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి బాన్సువాడలో పోలీస్, మహిళా, ట్రాఫిక్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు కామారెడ్డి పర్యటనలో గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న డీజీపీ సీవీ ఆనంద్ కామారెడ్డి, నవంబర్ 27: నేరాల నియంత్రణలో కామారెడ్డి జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసించారు. ఆపరేషన్ కవచ్ ద్వారా అంతర్రాష్ట్ర నేర ముఠాల కదలికలను అడ్డుకోవడం, సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన నగదును తిరిగి రికవరీ చేయడం అభినందనీయమన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ మరింత పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీకి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత జిల్లా పోలీస్ శాఖ పనితీరు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీస్ శాఖ సాధించిన ఫలితాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఆపరేషన్ కవచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాలకు కళ్లెం: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కామారెడ్డి జిల్లాలో ఇతర రాష్ట్రాల నేర ముఠాల కదలికలను అడ్డుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ కవచ్ మంచి ఫలితాలను ఇస్తోందని డీజీపీ పేర్కొన్నారు. గతంలో ఏటా 10 నుంచి 15 వరకు నేర ముఠాలు జిల్లాలో సంచరించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ప్రత్యేక నిఘా, నిరంతర తనిఖీలతో వాటి కార్యకలాపాలను నియంత్రిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా కొనసాగించాలని సూచించారు. సైబర్ నేరాల రికవరీలో ప్రశంసలు: సైబర్ నేరాల బాధితులు కోల్పోయిన నగదును తిరిగి రాబట్టడంలో కామారెడ్డి పోలీసులు సాధించిన ఫలితాలను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. 2024లో 55 శాతం, 2025లో 69 శాతం, 2026 నవంబర్ నాటికి 61 శాతం నగదును రికవరీ చేసినట్లు సమీక్షలో వెల్లడైంది. మొబైల్ ఫోన్ల రికవరీలో జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు అందిన 7,285 మొబైల్ ఫోన్లలో 3,683 ఫోన్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఏఐ సాంకేతికతతో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ట్రేడింగ్ తదితర మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని డీజీపీ సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం: యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని డీజీపీ పిలుపునిచ్చారు. 2029 డిసెంబర్ 31 నాటికి నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమీక్షలో వెల్లడించారు. గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, డ్రగ్స్ కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి పునరావాసం కల్పించేందుకు డీ-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల విస్తరణకు ప్రతిపాదనలు: జిల్లాలో నమోదవుతున్న మొత్తం నేరాల్లో 42 శాతం ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే జరుగుతున్నట్లు సమీక్షలో గుర్తించారు. కామారెడ్డి, దేవునిపల్లి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్కనూరు పోలీస్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి పట్టణంలో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు, బాన్సువాడలో కొత్త పోలీస్ స్టేషన్‌తో పాటు మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో మంజూరైన 1,158 పోలీస్ పోస్టులకు గాను ప్రస్తుతం 976 మంది పనిచేస్తుండగా, మరో 182 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: జిల్లాలో జాతీయ రహదారులు, ఇతర రాష్ట్రాలకు అనుసంధానమయ్యే మార్గాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని డీజీపీ సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే 25 బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. ముఖ్యంగా ఎన్‌హెచ్-44, 765డీ రహదారులపై నిఘా పెంచాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రౌడీషీటర్ల కదలికలు, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులతో బాండ్లు రాయించుకోవాలని, రాజకీయ అండతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 27 ఏళ్ల క్రితం పరిస్థితులు గుర్తుచేసుకున్న డీజీపీ: గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన అనుభవాలను డీజీపీ సీవీ ఆనంద్ గుర్తుచేసుకున్నారు. 1996 ఆగస్టు నుంచి 1999 డిసెంబర్ వరకు సుమారు మూడున్నరేళ్ల పాటు ఈ ప్రాంతంలో విధులు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం, మావోయిస్టుల సంచారం, క్లైమోర్, ల్యాండ్మైన్ల భయంతో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురయ్యేవని, ప్రజాప్రతినిధుల పర్యటనలకు కూడా భద్రత కల్పించడం కష్టంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారి శాంతిభద్రతలు మెరుగుపడటం సంతోషంగా ఉందన్నారు. పోలీసుల ఆరోగ్యానికి ప్రాధాన్యత: నిరంతరం విధుల ఒత్తిడిలో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీజీపీ సూచించారు. ఫిట్‌కాప్ కార్యక్రమం ద్వారా పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకోవాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మల్టీజోన్-1 ఐజీ కార్తికేయ, జోన్-3 ఇన్చార్జి డీఐజీ సున్‌ప్రీత్ సింగ్, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, సైబర్ సెక్యూరిటీ విభాగం ఎస్పీ హర్షవర్ధన్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
