బాన్సువాడ, రాజముద్ర న్యూస్:
కామారెడ్డి జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తోంది. వర్షపాతం తగ్గిపోవడం, కాలానికి తగ్గట్టు వానలు పడకపోవడం వల్ల రైతులు పండించిన పంటలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు జాగ్రత్తగా వ్యవహరించి, పండించిన పంటలను పొదుపుగా వినియోగించుకోవాలని బాన్సువాడ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం యూత్ అధ్యక్షులు అమ్ముల భాస్కర్ సూచించారు.
ఈ ఏడాది సాధారణంగా పడాల్సిన వర్షాలు ఆలస్యంగా రావడం, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దాటిపోవడం వల్ల భూమిలో తేమ తగ్గిపోయింది. ఫలితంగా పత్తి, మొక్కజొన్న, వరి వంటి పంటలు ఆశించిన దిగుబడిని ఇవ్వలేకపోతున్నాయి. ఎండలు ఎక్కువైపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. బోర్లు, బావులు కూడా నీటి కొరతతో ఎండిపోవడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది.
అమ్ముల భాస్కర్ మాట్లాడుతూ,…. “ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రైతులు ఆవేశపడకుండాముందుచూపుతో వ్యవహరించాలి. పంటలను వృథా చేయకుండా నిల్వ చేసుకోవడం, అవసరమైన మేరకు మాత్రమే వినియోగించడం చాలా ముఖ్యం” అని అన్నారు. అదేవిధంగా, రైతులు నీటిని పొదుపుగా వినియోగించడం, మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అనుసరించడం ద్వారా కొంత మేరనష్టాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.
రైతులు పంటల బీమా పథకాలు, ప్రభుత్వ సహాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విత్తనాల ఎంపికలో కూడా తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవడం అవసరమని చెప్పారు. వ్యవసాయ అధికారులు రైతులకు సమయానుకూలంగా సలహాలు ఇచ్చి, వారిని ఆదుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే, ఎల్‌నినో ప్రభావం ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకోవాలన్నారు
