Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లు పొందాలంటే... ఇవి తప్పనిసరిగా ఉండాలి ...
• విధి విధానాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
![Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లు పొందాలంటే... ఇవి తప్పనిసరిగా ఉండాలి ...](https://www.rajamudranews.com/media-webp/2024-03/indiramma-indlu-2-qhdc552cczhjzxwxhqapoi6t3wiooo41tpp5y8b7s0.webp)
హైదరాబాద్ - రాజముద్ర న్యూస్: తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు పొందాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన పత్రాలు ఉండవలెనని ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులేస్తూ సోమవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొదటగా సొంత జాగా ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రూ. 6 లక్షలు మంజూరు చేస్తారు. ఆ డబ్బులు కూడా నిర్మాణ దశలను బట్టి ఫీల్డ్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని డబ్బులు మంజూరు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున తెలంగాణ వ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల ఇండ్లను నిర్మించేందుకు సమాయత్తమవుతున్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండకూడదని దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు అదనంగా మరొక లక్ష అనగా ఆరు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. రెండవ దశలో 250 గజాల జాగా చూయించి దానిలో నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వం విధివిధానాలు అమలు చేసింది.