Veerabhadra Swamy: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో అగ్ని గుండాలపై నడుస్తున్న భక్తులు
• తెల్లవారుజాము నుంచే తండోపతండాలుగా భక్తులు
జై వీరభద్రా.. శరభ.. శరభ..!
భక్తిశ్రద్ధలతో వీరభద్ర స్వామి అగ్నిగుండాలు
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
భీమదేవరపల్లి రాజముద్ర న్యూస్:
కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో ప్రధాన ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమం భక్తి పారవశ్యంతో సాగింది. శనివారం తెల్లవారుజామున కణ కణ మండే అగ్ని కణాల్లోంచి భక్తులు జై వీరభద్రా.. శరభ.. శరభ.. అంటూ నడుచుకుంటూ వెళ్లారు. అగ్నిగుండాల్లోంచి నడుచుకుంటూ వెళ్లేందుకు భక్తులు పోటీపడ్డారు. ఒకరిని చూసి మరొకరు ఇలా వందలాదిమంది అగ్నిగుండాల్లోంచి నడుచుకుంటూ వెళ్లేందుకు ఉత్సాహం చూపారు. భక్తి భావంతో ఉప్పొంగి పోయారు. అగ్నిగుండా లోంచి నడుచుకుంటూ వెళ్లేందుకు వచ్చిన భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. అగ్నిగుండాల కార్యక్రమం గంటకు పైగా కొనసాగింది. ఉదయం నాలుగు గంటల నుంచి వేద పండితుల పర్యవేక్షణలో అగ్నిగుండాల కార్యక్రమం కొనసాగింది. భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్ష యజ్ఞానికి ప్రతిరూపమైన అగ్నిగుండ కార్యక్రమానికి ముందుగా అగ్నినీ ప్రతిష్టించారు. ఎల్కతుర్తి పులి రమేష్ ఆధ్వర్యంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై సాయిబాబు, పోలీస్ సిబ్బందితోపాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అగ్నిగుండాల్లో నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు.