Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
• సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి
Gram Panchayat Eections, Bheema Devarapalli:
'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
- సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి
-రిజర్వేషన్ల ఖరారు పై ఎడతెగని ఉత్కంఠ
-పాతవి కొనసాగిస్తారా.. కొత్తగా ప్రకటిస్తారా?
-ఆందోళనలో ఆశావహులు
భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్
భీమదేవరపల్లి మండలం లో పంచాయతీ ఎన్నికల వేడి రాజకుటుంది. ఆశావహులు పంచాయతీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సర్పంచ్లతో పాటు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు పంచాయతీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో యువకులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలో మొత్తం 25 పంచాయతీలు, 234 వార్డులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించిన చోట ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని యువత పట్టుదలగా కనిపిస్తోంది.
*యువత ఉత్సాహం*
రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నది. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు అదే సమయంలో ఇటు ప్రజాసేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలామంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
విద్యావంతులైన యువకులు పోటీకి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకురావచ్చుని యువకులు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీలో పని చేస్తున్న యువజన నాయకులు సైతం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ మద్దతు పంచాయతీల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలోని యువ నాయకులు ఎక్కువ సంఖ్యలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లోని యువ నాయకులు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడ్డారు. యువ నాయకుల పనితీరుపై సంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారిని పంచాయతీ పరిధిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు సైతం తమ పార్టీలోని యువ నాయకుల పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటుంది.
తాము పుట్టిన గ్రామం బాగుపడాలన్న సంకల్పంతో విద్యావంతులు, ఉద్యోగులు సైతం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికల బరిలోకి యువత రావడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో యువత వస్తే గ్రామాలు అభివృద్ధి బాట పట్టడంతో పాటు ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
*ఆసక్తి.. ఆందోళన*
పోటీకి ఆసక్తి చూపుతున్న యువకులు ఇప్పటికే కథనరంగంలోకి దూకేశారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం పై దృష్టి సారించారు. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పల్లెల్లోని సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు ఓటర్లను ప్రభావితం చేసే నేతలను కలుస్తున్నారు. కానీ ఎక్కడ తమ మనసులో మాట బయట పెట్టడం లేదు రిజర్వేషన్ తమకు అనుకూలిస్తుందో లేదోనని ఆశావహులను ఆందోళనకు గురి చేస్తున్నడమే అందుకు కారణం. రిజర్వేషన్ కలిసి వస్తే అప్పుడు నేరుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.