Bheemadevarapally: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి
-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి (Bheemadevarally) మండలంలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం నాడు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో పలువురు లబ్ధిదారులకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇండ్ల నిర్మాణం చేపట్టి ఎన్ని రోజులు అవుతుందని, నిర్మాణానికి మెటీరియల్ ఎక్కడినుండి తెచ్చుకుంటున్నారని, ఇప్పటివరకు ఎంత ఖర్చయిందని, ఎంత విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారని గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులను కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకునే విధంగా చూడాలన్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు రెండు రోజుల్లో లక్ష రూపాయల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమా చేయనున్నట్లు తెలిపారు. ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు ఎన్ని ప్రారంభమయ్యాయి అని ఎంపీడీవో(MPDO) వీరేశంను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఎంపీడీవో ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.