Anderson: భళా అండర్సన్..ఈ రికార్డు అందుకోవడం అసాధ్యమే

ధర్మశాల:టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ ఫాస్ట్ బౌలర్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నెలకొల్పిన రికార్డ్‌ని అందుకోవడం ఇప్పట్లో వీలుకాదేమో.ఎందుకంటే 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. ధర్మశాలలో భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 700, అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. అండర్సన్ (700) కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) ఎక్కువ టెస్టు వికెట్లు తీశారు. అయితే వారిద్దరూ స్పిన్ బౌలర్లు.
కాగా, 1877 నుంచి ప్రారంభమైన 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అండర్సన్ 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచాడు. 2002లో ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పుడు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో అండర్సన్ అత్యుత్తమ బౌలింగ్ 7/42. అంతేకాదు.. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ అండర్సన్ నిలిచాడు. మొత్తంమీద అంతర్జాతీయ క్రికెట్‌లో అండర్సన్.. శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ (133 మ్యాచ్‌లలో 800 వికెట్లు), దివంగత ఆస్ట్రేలియా స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ (145 మ్యాచ్‌లలో 708 వికెట్లు) తరువాత నిలిచాడు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు సుదీర్ఘ కాలం పాటు ఆడటం కష్టసాధ్యం.తరచూ గాయాలపాలై ఆటకు స్వస్థి చెబుతుంటారు.అలాంటిది అండర్సన్ సాధించిన ఈ ఫీట్‌ని ప్రస్తుత పరిస్థితిలో ఓ ఫాస్ట్ బౌలర్ అందుకోవడం వీలయ్యే అవకాశం చాలా తక్కువ అని క్రికెట్ విశ్లేషకులంటున్నారు.