CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల ప్రజా పాలన భేష్
• పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ క్యాబినెట్

హైదరాబాద్, రాజముద్ర న్యూస్: రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress).. ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ శుక్రవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకోబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ (Arogya Sri) కింద రూ.10లక్షల దాకా చికిత్సను అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన విధంగానే తొలి రోజునే ప్రగతిభవన్ (Pragathi Bhavan) ముందున్న కంచెను తొలగించేలా చర్యలు చేపట్టారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కటొక్కటిగా చక్కదిద్దుతూ మొదటి వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సర్కారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు పథకాలు అందజేసింది. ఔటర్ రింగ్‌రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతోపాటు గొర్రెల పంపిణీ చేపపిల్లల పథకాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీతోపాటు మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టడం ద్వారా అవినీతిపై ఉక్కుపాదం మోపింది. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ.వంద కోట్లకుపైగా వ్యాట్ ఎగవేత పై విచారణకు ఆదేశించడంతోపాటు ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ అధికారుల పాత్రను వెలికితీసింది. వారంలో రెండు రోజుల పాటు ప్రజలు తమ సమస్యలను నివేదించుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
29 వేల ఉద్యోగాలు
అధికారంలోకి రాగానే నియామక ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం వేగిరం చేసింది. మూడు నెలల్లోనే 29,384 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అందించింది. వీరిలో 53 శాతం పురుషులు, 47 శాతం మహిళలు ఉన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎ్‌సపీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోనివే. ఇవీ కాక సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలోని రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులన్నింటినీ అధిగమిస్తూ... టీఎ్‌సపీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసింది. కొత్త పాలకవర్గాన్ని నియమించి, యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరీక్షల నిర్వహణ వైఫల్యాలతో గ్రూప్- 1 పరీక్ష రెండుసార్లు రద్దుకాగా... కొత్త పోస్టులను చేర్చి... 563 పోస్టులతో గ్రూప్- 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీతో మెగా డీఎస్సీని ప్రకటించింది. త్వరలో జాబ్ క్యాలెండర్ అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వ పాలన తీరును ఎండగడుతూ కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేసిన తీరుతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలను ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించి.. ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రజల ముందుంచింది.
ఉచిత ప్రయాణం @ 23కోట్ల మంది
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించగా... ఇప్పటిదాకా 23 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారు. ఇదే పథకం కింద కేవలం రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మరోవైపు.. అరుపలైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అందించే ‘గృహ జ్యోతి’ పథకాన్ని ఈ నెల 1వ తేదీ నుంచే అమలు చేస్తోంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే 40 లక్షల మందికి పైగా గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లు జారీ చేసింది. అలాగే, రూ.22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అరుపలైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఈ పథకం కింద అందనుంది. మలి విడతలో ఇళ్ల స్థలాలు లేనివారికి ప్రభుత్వ స్థలం కేటాయించడంతోపాటు ఆర్థిక సాయం అందిచనుంది.
సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు
-
ఎనిమిదిన్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూముల సమస్యకు పరిష్కారం లభించడంతో హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై రూ.2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌వైపు జాతీయ రహదారి-44పై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
-
రూ.2,700 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు.
-
దావో్‌సలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో దాదాపు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 30 వేల ఉద్యోగాల కల్పనకు భరోసా.
-
300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2 ప్రారంభిస్తామని బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ ప్రకటన. రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన. వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం
-
ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ
-
హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవం, పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు
-
హైదరాబాద్‌లో డ్రగ్స్ చలామణి పై ఉక్కుపాదం
-
సింగరేణిలో 43వేల మంది కార్మికులకు వర్తించేలా రూ.కోటి ప్రమాద బీమాకు బ్యాంకులతో ఒప్పందం
-
హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలం కేటాయింపు
-
పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050.
-
ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నియోజకవర్గాల అభివృద్థికి రూ.1190 కోట్ల నిధులు.
-
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
-
కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలకు భూమి పూజ.
-
ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటుకు పచ్చజెండా
-
కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డు అందజేస్తామని ప్రకటన
-
హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ ఏర్పాటు
-
రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు.
-
రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’