Bheemadevarapally, Vangara: టీబీ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత
డాక్టర్ రుబీనా

టీబీ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత
-డాక్టర్ రుబీనా
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తే క్షయ వ్యాధిని నివారించవచ్చని డాక్టర్ రుబీనా అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో వైద్య సిబ్బంది, పీవీ రంగారావు పాఠశాల బాలికలతో కలిసి క్షయ వ్యాధిని నివారించాలని ప్ల కార్డులతో నినాదాలు చేస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రుబీనా మాట్లాడుతూ .. క్షయ (టీబీ) అనేది ఒక అంటు వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ కూలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో ట్యూబర్ కూలై బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఒక్కసారి ఒంట్లోకి చేరిందంటే జీవితకాలం మన లోపలే ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా యాక్టివ్ అవుతుంది.టీబీ వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. టీబీకి పూర్తిస్థాయిలో చికిత్స ఉన్నది. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా నయమవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెహమాన్ , డాక్టర్ రాజశేఖర్, ప్రిన్సిపల్ అఫ్రీన్, సూపర్వైజర్స్ వాణి, మోహన్, ఏఎన్ఎం స్వరూప, హారిక తదితరులు పాల్గొన్నారు.